Pages

తెలుగు పద్యానికి - ప్రాస , యతి నియమములు:

ప్రాస నియమములు:


ప్రధమ పాదమందు ద్వితీయాక్షరము ఏ హల్లుండునో తక్కిన పాదములలో ఆ హల్లే ఉండవలయును.

ప్రాసాక్షరము ద్విత్వమైన, అన్ని పాదములందునూ అదే అక్షరము ద్విత్వముగను, సంయుక్తమైన అన్ని పాదములందునూ అదే హల్లు సముదాయము సంయుక్తముగను ఉండవలెను.

ప్రాస పూర్వాక్షరము గురువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము గురువుగనూ, ప్రాస పూర్వాక్షరము లఘువైన, అన్ని పాదములందునూ ప్రాస పూర్వాక్షరము లఘువుగను ఉండవలెను.

ప్రాసాక్షరము పూర్ణబిందువుతో కూడిన, అన్ని పాదములందునూ అదే అక్షరము పూర్ణబిందువుతో ఉండవలెను.

ద-ధ, ధ-థ, ఱ-ర, న-ణ, ల-ళ లకు ప్రాస కుదురును.

యతి నియమములు:

(1) ఈ క్రింది వర్ణసమూహములలో ప్రతి వర్ణమునకు మిగిలిన వాటితో యతి చెల్లును

అ, ఆ, ఐ, ఔ, హ, య, అం

ఇ, ఈ, ఎ, ఏ, ఋ

ఉ, ఊ, ఒ, ఓ

క, ఖ, గ, ఘ, క్ష

చ, చ, జ, ఝ, శ, ష, స

ట, ఠ, డ, ఢ

త, థ, ద, ధ

ప, ఫ, బ, భ, వ

న, ణ

ర, ఱ, ల, ళ

పు, ఫు, బు, భు, ము


(2) కఖగఘఙ్, చచజఝఞ్, టఠడఢణ, తథదధన, పఫబభమ లను వర్గములందురు. ప్రతివర్గములోను చివర ఉన్న అనునాసికమునకు,ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి పూర్ణ బిందు పూర్వకములైతే యతి చెల్లును. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన “న” కు “కంద” లోని “ద” కు యతి చెల్లును. ఉచ్చారణ పరంగా “కంద” ని “కన్ద” లా పలుకవచ్చు. అందువలన “న్ద”లోని “న”తో యతి కుదురును.

(3) అటులనే, “మ” కు పూర్ణబిందుపూర్వకమైన య, ర, ల, వ, శ, ష, స, హ లతో యతి కుదురును.

(4) యతి స్థానమున గాని యతి మైత్రి స్థానమున గాని సంయుక్తా క్షరమున్నచో అందులో ఏ ఒక్క అక్షరానికి యతి చెల్లినా సరిపోతుంది. ఉదాహరణకు, యతి స్థానములో “క్ష్మ” ఉన్న, అందులోని, “క”, “ష”, “మ” లలో ఏ అక్షరమునకైనా యతి కుదర్చ వచ్చును.

(5)ఋకారముతో నున్న హల్లులకు యతి కుదురును. ఉదాహరణకు, “ద” కు “గ” యతిమైత్రి లేకున్ననూ, “దృ” కు “గృ” కు యతి కుదురును.

(6) హల్లులకు యతి కుదుర్చునపుడు, హల్లుకి దానిపైనున్న అచ్చుకి కూడా యతి మైత్రి పాటించవలెను. ఉదాహరణకు, “తు” కు “ఒ” కు యతి చెల్లదు. “తు”(త+ఉ) లో ఉన్న “త” కు కూడా యతి కుదర్చవలెను.

ప్రాస- యతి నియమములు:

పాదమందలి మొదటి అక్షరమునకు, యతి మైత్రి స్థానములోనున్న అక్షరమునకు యతి కుదుర్చుటకు బదులు, పాదమందలి రెండవ అక్షరమునకును, యతి మైత్రి స్థానము తరువాతి అక్షరమునకు ప్రాస కుదుర్చుటను “ప్రాసయతి” అందురు. తేటగీతి, ఆటవెలది, సీసము మొదలగు పద్యములలో “ప్రాసయతి” వాడవచ్చు. ఉదాహరణకు, “వేడి గిన్నె చురక వాడిగా తగలగా” అన్నపాదంలో, “వే”కి “వా”కు యతి కుదరదు. కానీ, “వేడి”కి “వాడి”కి “ప్రాసయతి” కుదురుతుంది.

No comments:

Post a Comment