తెలుగు పద్య వృత్తాలు చందస్సు -- ఉత్పలమాల

        తెలుగు పద్య వృత్తాలు  చందస్సు  --  ఉత్పలమాల

ఈ వృత్తం నడక ఇలా ఉంటుంది:

"తానన తాన తాన తన తానన తానన తాన తాన తా"
 |____ యతి మైత్రి ____|  10 వ అక్షరం తో

దీనిని మూడు మూడు అక్షరాలుగా విభజించి గణాలు గుర్తిస్తే

   భ       ర         న       భ          భ      ర      వ
U I I   U I  U   I  I  I  U  I I   U I I   U I  U   I  U
తానన  తాన తా  న తన  తానన  తానన  తాన తా  న తా

అంటే
ఉత్పలమాల వృత్తంలో "భ ర న భ భ ర వ" గణాలు వస్తాయి
10 వ అక్షరం తో యతి మైత్రి అని చెప్పవచ్చు.

ఉదా:
(దీనిని - మీకు తెలిసిన ఇతర ఉత్పలమాల పద్యాలను - పైన చెప్పిన  నడక తీరులో చదవటం అలవాటు చేసుకొంటే పద్యాలు ఏ వృత్తానికి చెందినవో గుర్తించటం, పద్యం కంఠస్థం చేయటం, రాయటం సులువవుతుంది)

తొండము నేక దంతమును తోరపు బొజ్జయు వామ హస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై
యుండెడి పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్

పై పద్యంలో మొదటి పాదాన్ని ఉత్పలమాలకి సూచించిన నడక ప్రకారం కొంచెం విడ దీసి రాస్తే:

తానన  తాన తాన  నన తానన తానన  తాన తాన  నా
తొండము నేక దంత మును తోరపు బొజ్జయు వామ హస్త మున్

చూశారా ఈ పద్యంలో పదాల అల్లిక మనం రాసుకున్న నడకకి ఎంత దగ్గరగా ఉందో?!(ఈ పద్యం ఉదాహరణగా తీసుకోవడానికి ఇదొక కారణం!) అన్ని పద్యాల్లో ఇంత దగ్గర కలయిక ఉండకపోవచ్చు.
ఈ పద్యంలోనే నాలుగో పాదం చూడండి:

తానన  తాన  తాన  నన  తానన  తానన  తాన తాన  నా
యుండెడి పార్వ తీత  నయ  యోయిగ  ణాధిప నీకు మ్రొక్కె దన్

పదాల విరుపు కొంచెం అసహజంగా ఉంటుంది. అయినా పద్యాల నడక పట్టుబడాలంటే కొంత కాలం పద్యాలని ఇలా చదవక తప్పదు. నడక కొంత పట్టు చిక్కాక ఇలా విరవకుండానే పద్యాన్ని చదవచ్చు.

ఇంకో గమనించ దగ్గ విశేషం ఏమిటంటే, మనం రాసుకొన్న నడకలో, రెండో సారి "తానన" వచ్చే ముందు కొంచెం pause వచ్చి "తానన"  తాళంలో దెబ్బ లాగా మంచి ఊపుతో వస్తుంది.
ఈ తానన లో "తా" యతి స్థానం కావటం యాదృచ్ఛికం కాదు. చెప్పొచ్చేదేమిటంటే పద్యాన్ని మనం
రాసుకున్న నడకలో చదివితే యతి స్థానం దానంతటదే తెలుస్తుంది
- అక్షరాలు లెక్కేసుకోవలసిన పని లేదు.

ఇప్పుడు formal గా గణవిభజన చేసి చూద్దాం:

    భ    ర      న    భ    భ     ర      వ
 U I I | U I  U |I I I|U I I | U I I|U  I   U| I U 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జవై

"ద్విత్వం / సం యుక్తం  ముందర అక్షరాలను గురువు చేస్తాయి"
అనే సూత్రం వల్ల "గుజ్జు", "విద్య", "కెల్ల", "నొజ్జ"  లను
"U I" గా గుర్తు పెట్టాము. 

ప్రాస అన్ని పాదాలలోనూ బిందు పూర్వక "డ"  సరిపోయింది.

యతి : 1వ అక్షరం "కొం" - "కో" 10వ అక్షరం సరిపోయింది.

చదువరులు అన్ని పాదాలనూ ఇలాగే విభజించి సరి చూసుకోవచ్చు.
నడక ప్రకారం చదువుతూ యతి స్థానాన్ని గుర్తించడం, పద్యంలో అన్ని గణాలూ సరిగా కుదిరిందీ లేనిదీ కనిపెట్టటం సాధన చేయాలి. పద్యంలో అక్కడక్కడా అక్షరాలని వదిలి ఎక్కడ పద్యం నడక
తప్పిందీ గుర్తించడం పద్య నడక అలవడటంలో మంచి సాధననిస్తుంది.

No comments:

Post a Comment